వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచి బరిలోకి దిగుతా.. వైఎస్ షర్మిల క్లారిటీ..!

Wednesday, March 24th, 2021, 05:09:46 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఆమె జిల్లాల వారీగా వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లా నేతలతో లోటస్‌పాండ్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్‌కు పులివెందుల ఎలాగో, తనకు పాలేరు అలా అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఖమ్మం జిల్లాలో తాము సభ నిర్వహించే తీరుతామని, తమ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని షర్మిల చెప్పుకొచ్చారు.

అయితే ముఖ్యంగా వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అయితే గతంలో ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ కొన్ని స్థానాలు గెలుచుకోవడం, పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు సూచించడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే తెలంగాణ ఏర్పాటు అనంతరం పాలేరు నుంచి కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకట్ రెడ్డి గెలవడం, ఆ తరువాత ఆయన చనిపోవడంతో ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందాడు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఉపేందర్ రెడ్డి గెలవడం, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఏదేమైనా ఈ స్థానంలో కాంగ్రెస్ అభిమానులు ఎక్కువగా ఉండడం, ఆ ఓటు బ్యాంక్ తనకు కలిసొస్తుందని భావించిన షర్మిల ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది.