వైఎస్ షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డికి బెదిరింపులు వస్తున్నాయట. తనపై భౌతిక దాడులు చేస్తామని రేవంత్ రెడ్డి వర్గం బెదిరిస్తోందని కొండా రాఘవరెడ్డి ఆరోపణలు చేశారు. రేవంత్ సైన్యం పేరుతో తనకు బెదిరింపులు సందేశాలు, ఫోన్ కాల్స్ వచ్చాయని, రేవంత్ రెడ్డికి తక్షణం క్షమాపణలు చెప్పకపోతే భౌతిక దాడులకు దిగుతామని వార్నింగ్లు వస్తున్నాయని అన్నారు. వాట్సాప్లో వచ్చిన మెసేజ్ల ఆధారంగా రేపు తెలంగాణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తానని కొండా రాఘవరెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే ఇటీవల షర్మిల విద్యార్థులతో జరిపిన సమావేశంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్టేజ్ మీదకు వచ్చి భావోద్వేగంతో మాట్లాడిన విద్యార్థిని ఓదార్చడం, అండగా ఉంటానని షర్మిల హామీ ఇవ్వడం ఓ నాటకమని ఆరోపించారు. అంతేకాదు షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని అతడు విద్యార్థి కదు, నిరుద్యోగి కాదని కల్వరి టెంపుల్లో ఆర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని చెప్పుకొచ్చారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కొండా రాఘవ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ విమర్శలపై ఆగ్రహంతోనే తనకు బెదిరింపులు వస్తున్నాయని కొండా రాఘవ రెడ్డి అన్నారు.