బెస్ట్ చీఫ్ మినిస్టర్‌.. స్కోచ్ అవార్డ్ అందుకున్న వైఎస్ జగన్..!

Wednesday, February 17th, 2021, 02:15:32 AM IST


ఏపీ సీఎం వైఎస్ జగన్‌కి అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డ్ లభించింది. అయితే ఇప్పటివరకు ఏపీలో వివిధ శాఖలు, విభాగాలు అత్యుత్తమ పనితీరును కనపర్చినందుకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డును అందుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బెస్ట్ చీఫ్ మినిస్టర్‌గా వైఎస్ జగన్ స్కోచ్ అవార్డును అందుకున్నారు. ఒక ఏడాది కాలంగా ముఖ్యమంత్రి అందజేసిన పరిపాలనను ఆధారం చేసుకుని స్కోచ్ గ్రూప్ సంస్థ ఈ అవార్డులను అందజేస్తూ ఉంటుంది.

అయితే స్కోచ్ గ్రూప్ సంస్థల ఛైర్మన్ సమీర్ కొచ్చర్ నేడు వైెఎస్ జగన్‌ను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. బెస్ట్ సీఎం స్కోచ్ అవార్డును ఆయన జగన్‌కు అందజేశారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, వైఎస్సార్ చేయూత, దిశ చట్టం, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రాతిపదికగా తీసుకుని జగన్‌కు ఈ అవార్డును అందజేసినట్లు స్కోచ్ గ్రూప్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రమాణ స్వీకారం చేసిన ఏడాదిన్నర కాలంలోనే స్కోచ్ నుంచి అత్యుత్తమ ముఖ్యమంత్రి అవార్డును అందుకోవడంతో వైసీపీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.