యువ సీఎం పాలనకు ఇంతకంటే ప్రశంసలు ఏం కావాలి – ఎంపీ విజయసాయి రెడ్డి

Sunday, November 1st, 2020, 09:17:21 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పై వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరొకసారి ప్రశంసల వర్షం కురిపించారు. తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును తప్పుబడుతూ, టీడీపీ నేతల పై విమర్శలు చేస్తూనే, సీఎం జగన్ పై ప్రశంసలు కురిపించారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ గెలిస్తే అరాచకమే అంటూ శోకాలు పెట్టిన వారు అంతా ఏమయ్యారో అంటూ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. బాబు హయాంలో కంటే 18 శాతం నేరాలు తగ్గినట్లు క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది అని తెలిపారు. కుల, మత ఘర్షణలు, రెచ్చగొట్టే కుట్రలు జరిగినా ప్రజలు పట్టించుకోలేదు అని, యువ సీఎం పాలనకు ఇంతకంటే ప్రశంసలు ఏం కావాలి అంటూ వ్యాఖ్యానించారు.

ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు బాబు పేరు వదిలి పోలవరం ను ఒక కొలిక్కి తీసుకు రండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు మాత్రం, కరోనా లాక్ డౌన్ టైమ్ లో అంతా ఇళ్లకు పరిమితం అవ్వడం వలన నేరాలు కాదు, జీవితాలే ఆగిపోయాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అనుభవం ఉన్న మీరే దోపిడీ లు, దాడులు చేస్తున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. వైసీపీ తీరు పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస విమర్శలు చేస్తున్నారు.