చంద్రబాబు ది క్రిమినల్ మైండ్…ఇలా చేస్తే డిపాజిట్లు కూడా దక్కవు – వైసీపీ ఎంపీ సురేష్

Friday, May 22nd, 2020, 08:11:21 PM IST

రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం పై ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు అధికార పార్టీ కి ప్రశ్నలతో ముప్పు తిప్పలు పెడుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు తీరు పై వైసీపీ నేత, ఎంపీ నందిగం సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ప్రతి అభివృద్ది కార్యక్రమానికి అడ్డు తగులుతూ ప్రజలను మోసం చేస్తున్నారు అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిస్థితుల పై చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న తరుణంలో వైసీపీ నేతలు ఘాటుగా బదులు ఇస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి అని వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో కూడా ఇలానే చంద్రబాబు వ్యవహరిస్తే టిడిపి కి కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అని నందిగం సురేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దళితులను అన్ని రకాలుగా మోసం చేశారు అని, వారిని కేవలం ఓటు బ్యాంక్ గానే చూశారు అని అన్నారు. అయితే ఆంగ్ల మాధ్యమాన్ని టిడిపి నేతలు అంతా కుట్ర పన్ని అడ్డుకున్నారు అంటూ వైసీపీ ఎంపీ సురేష్ ధ్వజమెత్తారు.

అయితే డాక్టర్ సుధాకర్ విషయం పై నందిగం సురేష్ స్పందించారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు చాలా సంయమనం పాటించారు అని కొనియాడారు. సీబీఐ విచారణ లో వాస్తవాలు వెలువడుతాయి అని వ్యాఖ్యానించారు. అయితే సుధాకర్ చేసిన వ్యాఖ్యలను టిడిపి నేతలు సమర్ధించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.జగన్ పై ఇష్టానుసారంగా మాట్లాడిన వారికి మద్దతు పలకడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలో ఎప్పటికైనా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేశారు.బాబు ఇలా వ్యవస్థలను మేనేజ్ చేసుకొని బతకాల్సిందే అంటూ ఘాటు విమర్శలు చేశారు.