వెంటిలేటర్ పై ఉన్న టీడీపీని బతికించుకునేందుకే దిగజారుడు రాజకీయాలు

Sunday, January 17th, 2021, 09:32:46 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్న తాజా పరిణామాల పై వైసీపీ టీడీపీ ఒకరి పై మరొకరు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే టీడీపీ నేతల పై, టీడీపీ చేస్తున్న రాజకీయాల పై వైసీపీ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెంటిలేటర్ పై ఉన్న టీడీపీని బతికించుకొనెందుకే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవాలయాల పై దాడులు చేయిస్తూ మత విద్వేషాలు సృష్టిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే దాడుల వెనుక కుట్ర కోణం ఉందని డీజీపీ స్పష్టం చేయడం తో ఎక్కడ తమ పేర్లు బయటికి వస్తాయో అని టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు తదితరులు భయపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే చంద్రబాబు నాయుడు హయాంలో పుష్కరాల్లో 29 మంది మృతి చెందినప్పుడు తమ నాయకుడు సున్నితమైన అంశం కావడం తో ఆచితూచి స్పందించారు అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మత సామరస్యం ను కాపాడటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్త శుద్ది తో పని చేస్తున్నారు అంటూ కొనియాడారు. అయితే రాష్ట్రంలో విద్వేషాలు సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అని అన్నారు. అయితే గతంలో టీడీపీ పాలనా లో జరిగిన పలు సంఘటనలను వివరిస్తూ ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ టీడీపీ నేతల పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.