చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారు – రోజా

Monday, March 15th, 2021, 07:25:56 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో తాజాగా వచ్చిన మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ భారీ విజయం సాధించింది. అయితే వైసీపీ మరొకసారి ఘన విజయం సాధించడం పట్ల వైసీపీ నేతలు, కార్యకర్తలు, అంతా కూడా సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ మేరకు వైసిపి నేతలు ప్రతి పక్ష పార్టీల పై వరుస విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ పాలనా విధానం పై ప్రశంశల వర్షం కురిపిస్తూనే, ఇటు ప్రతి పక్షాల పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మేరకు నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల ద్వారా ప్రజలు సీఎం జగన్ మోహన్ రెడ్డి మంచి గిఫ్ట్ ఇచ్చారు అని వ్యాఖ్యానించారు. అఖండ మెజారిటీ లతో అత్యధిక సీట్లను గెలిపించారు అని, వార్ వన్ సైడ్ అనే విధంగా ఎన్నికలు జరిగాయి అని అన్నారు.

అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటున్నారు అని సెటైర్స్ వేశారు రోజా. వాళ్ళు ఇక అక్కడే పరిమితం అయితే మంచిది అంటూ చెప్పుకొచ్చారు. ప్రజల విశ్వాసం ఉంటే ఎంతటి ఘన విజయం సాధించ వచ్చునో మునిసిపల్ ఎన్నికలు నిరూపించాయి అని వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకూ, ఒకే రకంగా ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు అని తెలిపారు. అంతేకాక వైసీపీ అభ్యర్దులు ఎక్కడ ఉన్నారో వెతుక్కొని మరి ఓటేశారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇంత అభిమానం పొందడం సీఎం జగన్ కే సాధ్యం అయింది అని, చరిత్ర సృష్టించాలి అన్నా, దాన్ని తిరగ రాయాలన్నా జగన్ కే సాధ్యం అంటూ ఎమ్మెల్యే రోజా అన్నారు.