తుది శ్వాస వరకు వైఎస్ కుటుంబానికి కార్యకర్త గానే ఉంటా – వైసీపీ ఎమ్మెల్యే

Wednesday, August 26th, 2020, 03:02:39 AM IST

రాజకీయం గా తన పై వస్తున్న ఆరోపణలు అన్ని కూడా అసత్యాలు అని వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేకపోతే తనకు రాజకీయ భవిష్యత్ ఉండేదే కాదు అని, అసలు రాజకీయాల్లోకి వచ్చే వాడిని కాదు అని పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంతేకాక తొలి నుండి కూడా తాను వైయస్సార్, జగన్ అభిమాని అంటూ చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే సుధీర్. అయితే వైసీపీ నేత, ఎంపీ రఘురామ కృష్ణంరాజు తో తనను పోల్చడం దారుణం అని, రఘురామ కృష్ణంరాజు అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్దం కావడం లేదు అని తెలిపారు. అంతేకాక సీఎం జగన్ కి తాను ఎల్లప్పుడూ విధేయుడు గా ఉంటా అని తెలిపారు.

అయితే సీఎం జగన్ ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పై అసత్య ప్రచారాలు వద్దు అని, వైయస్ కుటుంబాన్ని ఎదిరించిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ కూడా బాగుపడలేదు అని తెలిపారు. అంతేకాక రఘురామ కృష్ణంరాజు, ఆది నారాయణ రెడ్డి లాంటి వాళ్ళే ఇంట్లో కూర్చున్నారు అని తెలిపారు. జమ్మలమడుగు లో తన గెలుపు కి ఎంపీ అవినాష్ రెడ్డి కారణం అని, అటువంటి కుటుంబాన్ని నేనెందుకు తిడతాను అని అన్నారు.నా మీద వచ్చిన ఆరోపణలు ఖండిస్తున్నా అని, తుది శ్వాస వరకు వైఎస్ కుటుంబానికి కార్యకర్త గానే ఉంటా అని తెలిపారు.