నిరుద్యోగులకు సచివాలయాల ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వ వైఫల్యమా?

Sunday, November 8th, 2020, 03:00:34 AM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ కి చెందిన నేత, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద రావు చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు తన పాలనలో ఏనాడైనా ఒక ఎకరం భూమి ను కొని పేదవాడికి ఒక సెంటు భూమిని ఇండ్ల స్థలం కోసం ఇచ్చాడా అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం లో వంద కోట్ల రూపాయలు వెచ్చించి, పేదల ఇండ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేశారు అని అన్నారు.

అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇన్ని చేస్తున్నా, తమ ప్రభుత్వం విఫలం అయింది అని చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. జగన్ పేదవాడి కన్నీరు తుడిచారు, అది వైఫల్యమా? నిరుద్యోగులకు రెండు లక్షల సచివాలయాల ఉద్యోగాలు ఇవ్వడం ప్రభుత్వం వైఫల్యమా అంటూ చంద్రబాబు పై ధ్వజమెత్తారు. అయితే వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, మహిళలు, రైతులకు, యువతకు అనేక పథకాలు ఇచ్చి ఆదుకుంటున్న ప్రభుత్వం అని కొనియాడారు. అయితే ప్రజా సంకల్ప యాత్ర తర్వాత సీఎం జగన్ అధికారం లోకి వచ్చాక ఎటువంటి మార్పు జరిగిందొ తెలుసుకోవడానికి పాదయాత్ర అంటూ ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.