జనసేనాని ఢిల్లీ పర్యటనకు వెళ్ళేది విశాఖ ఉక్కు కోసమా…తిరుపతి సీటు కోసమా?

Friday, February 12th, 2021, 07:38:23 AM IST

Ambati_Rambabu

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. ప్రైవేటీకరణ దిశగా అడుగులు పడడం బాధాకరం అని, ఎన్నో ఉద్యమాలు, ప్రాణ త్యాగాలు చేస్తే ఆవిర్భావం అయింది అని వ్యాఖ్యానించారు. అయితే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు గా పోరాటం సాగింది అని, ఇది కేవలం విశాఖ కే కాదు, రాష్ట్రానికే తలమానికం అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రధాన ప్రతి పక్షం అయినటువంటి తెలుగు దేశం పార్టీ ఈ అంశం పై పోరాటం చేయాల్సింది పోయి, ప్రభుత్వం పై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది అంటూ మండిపడ్డారు. అయితే చంద్రబాబు హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తొలి అడుగు పడింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మేరకు జన సేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అంబటి రాంబాబు విరుచుకు పడ్డారు.

అయితే విశాఖ ఉక్కు ను కాపాడుకుంటాం అని ప్రగల్భాలు పలికే పవన్ కళ్యాణ్, ఆ దిశగా ఢిల్లీ పెద్దలనఒప్పించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ సూటీగా ప్రశ్నించారు. అంతేకాక జనసేనాని ఢిల్లీ పర్యటనకు వెళ్ళేది విశాఖ ఉక్కు కోసమా లేక తిరుపతి సీటు కోసమా అంటూ సెటైర్స్ వేశారు. అయితే బీజేపీ తో జతకట్టిన పవన్ కి కేంద్రానికి నచ్చజెప్పాల్సిన బాధ్యత లేదా అంటూ విమర్శించారు. అయితే కేంద్ర సంస్థ పై రాష్ట్ర ప్రభుత్వం కి ఏ హక్కులు ఉండవు అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు అని అన్నారు.