దళితుల భూముల్ని చంద్రబాబు అక్రమంగా కాజేశారు – ఆర్కే

Friday, March 19th, 2021, 07:31:47 AM IST

తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి లో దళితుల భూములను చంద్రబాబు అక్రమం గా కాజేశారు అని వ్యాఖ్యానించారు. రైతులకు మాయమాటలు చెప్పి, తక్కువ ధరకే వారి భూముల్ని సొంతం చేసుకున్నారు అంటూ ఆళ్ళ రామకృష్ణారెడ్డి విమర్శించారు. అయితే సీఐడీ అధికారుల ఎదుట హాజరు అయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి, తన దగ్గర ఉన్న భూ కుంభకోణానికి సంబంధించి అన్ని ఆధారాలను అందించారు. అయితే భూ లావాదేవీలకు సంబంధించి రెవెన్యూ అధికారులు ఇవ్వాల్సిన జీవో లను మునిసిపల్ శాఖ ద్వారా అక్రమం గా పొందారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్క మంగళగిరి నియోజక వర్గంలోనే 500 ఎకరాల అసైన్డ్ భూములను కాజేశారు అని ఆరోపణలు చేశారు. అయితే తాడికొండ తో కలుపుకుంటే మొత్తం గా నాలుగు వేల ఎకరాల భూమిని లాక్కున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఈ మొత్తం వ్యవహారం పై రైతులు తన దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే అన్నారు. అందుకోసమే, దళితులకు అన్యాయం జరిగితే ఎవరైనా కేసు పెట్టొచ్చు అని, దీనికి దళితుడే కావాల్సిన అవసరం లేదని ఆర్కే వ్యాఖ్యానించారు. అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేయకపోతే సిఐడి అధికారుల ఎదుట హాజరు అయి, విచారణ ఎదుర్కోవాలి అని సవాల్ చేశారు. అయితే మరో పక్క చంద్రబాబు నాయుడు హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన పై నమోదు అయిన ఎఫ్ ఐ ఆర్ ను కొట్టి వేయాలి అంటూ హై కోర్ట్ ను ఆశ్రయించారు.