కక్షసాధింపే అయితే విచారణ లేకుండానే కేసులు పెట్టేవాళ్ళం కదా?

Tuesday, September 15th, 2020, 03:43:01 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చోటు చేసుకున్న పరిణామాల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధికార, ప్రతి పక్ష పార్టీ నేతలు ఇప్పటి వరకు ఒకరి పై మరొకరు అమరావతి రాజధాని అంశం విషయం లో ఘాటు విమర్శలు చేస్తున్నారు. అయితే అమరావతి రాజధాని పై ఏసీబీ కేసు నమోదు చేయడం తో వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ తీరు ను ఎండగడుతూ పలువురు విమర్శలు చేస్తుండగా, తాజాగా మంత్రి కురసాల కన్నబాబు మరియు ఎమ్మెల్యే మల్లాది విష్ణు లు స్పందించారు.

టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ చేశారు అంటూ ఆధారాలతో నివేదిక ఇచ్చాం అని కన్నబాబు తెలిపారు. గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత తమ పై ఉంది అని అన్నారు. అయితే కక్ష సాధింపే అయితే విచారణ లేకుండానే కేసులు పెట్టే వాళ్ళం కదా అని కన్నబాబు సూటిగా ప్రశ్నించారు. అమరావతి లో ఎక్కడ చూసినా భూ కుంభకోణాలు అని మల్లాది విష్ణు ఆరోపణలు చేశారు. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములను కొనుగోలు చేసినట్లు తెలిపారు. అంతేకాక టీడీపీ నేతలు దళిత భూముల్ని దోచుకున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడి భూముల్ని టీడీపీ నేతలు మరియు బినామీ లు కొనుగోలు చేసినట్లు తెలిపారు.