ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాలు, చట్టసభలు అంటే లెక్క లేదు – యనమల

Friday, March 26th, 2021, 11:27:12 AM IST

Yanamala

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై మరొకసారి తెలుగు దేశం పార్టీ కీలక నేత, శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వరుసగా రెండవసారి రాష్ట్ర బడ్జెట్ ను ఆర్డినెన్సు రూపంలో ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. అయితే పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు లేదా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు యనమల రామకృష్ణుడు. అయితే ఈ మేరకు దీని పై యనమల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాక రాష్ట్ర గవర్నర్ ఈ ఆర్డినెన్సు పై ఆమోద ముద్ర వేయరాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు రాష్ట్రం లో కీలకం అయిన తిరుపతి ఉప ఎన్నిక మరియు పెండింగ్ లో ఉన్న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల సాకుతో బడ్జెట్ సమావేశాలను వాయిదా వేయడం పలాయన వాదం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే వైసీపీ ప్రభుత్వం పై, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై యనమల రామకృష్ణుడు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్షిక బడ్జెట్ ను కూడా ఆర్డినెన్సు రూపంలో తెచ్చే దుష్ట సంప్రదాయానికి జగన్ రెడ్డి శ్రీకారం చుట్టారు అని వ్యాఖ్యానించారు. అంతేకాక ప్రభుత్వానికి ప్రజలు, ప్రతిపక్షాలు, చట్టసభలు అంటే లెక్క లేదు అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. దేశం లో మరే రాష్ట్రంలో కూడా ఇలాంటి కుంటి సాకులు చూపి బడ్జెట్ వాయిదా వేయలేదు అని వ్యాఖ్యానించారు. అంతేకాక గతంలో కూడా ఇదే తరహాలో తెచ్చిన మొక్కుబడి బడ్జెట్ తో పాటుగా మూడు రాజధానుల బిల్లును శాసన మండలి వ్యతిరేకించింది అంటూ చెప్పుకొచ్చారు. మరి ఈ వ్యవహారం పై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.