జగన్ అహంభావం తో వ్యవహరించారని చెప్పడానికి సుప్రీం వ్యాఖ్యలే నిదర్శనం

Monday, January 25th, 2021, 07:39:39 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహణ కి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ ను తిరస్కరిస్తూ సుప్రీం కోర్టు తీసుకున్న నిర్ణయం పై తెలుగు దేశం పార్టీ కీలక నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కి సుప్రీం కోర్టు అనుమతి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని యనమల రామకృష్ణుడు తెలిపారు.

అయితే గత కొద్ది రోజులుగా ఎన్నికల కమిషన్ నిర్వహణ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అహంభావం తో వ్యవహరించారు అనడానికి సుప్రీం కోర్టు వ్యాఖ్యలే నిదర్శనం అంటూ చెప్పుకొచ్చారు. అయితే చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదో ఒక వంక తో ప్రభుత్వం ఎన్నికలను ఆపాలని చూడటం, అంతేకాక ఉద్యోగ సంఘాలు వత్తాసు పలకడం ను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది అని, ఇప్పటి కి అయిన ఎన్నికలకు ప్రభుత్వం సహకరించాలి అని కోరారు.