రాష్ట్రానికి సరైన కేటాయింపులు జరగలేదు…ఏపీ ప్రభుత్వం విఫలం

Monday, February 1st, 2021, 04:48:31 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై తెలుగు రాష్ట్రాల్లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు తెలుగు దేశం పార్టీ కి చెందిన కీలక నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకం గా లేదు అని, కేంద్రం పై ఒత్తిడి తీసుకు రావడం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయింది అంటూ యనమల రామకృష్ణుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి సరైన కేటాయింపులు జరగలేదు అంటూ పెదవి విరిచారు. ప్రైవేట్ రంగానికి ప్రోత్సహించే విధంగా, పెట్టుబడులను ఆకర్షించే విధంగా బడ్జెట్ లేదు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే కరోనా వైరస్ మహమ్మారి వలన దెబ్బతిన్న రంగాలు కోలుకునే విధంగా ఎలాంటి కేటాయింపులు జరగలేదు అని, నిరుద్యోగ సమస్యను పరిష్కారం కొరకు ఎలాంటి నిధులు కేటాయించలేదు అని విమర్శించారు. అయితే ఇలా చేయడం ద్వారా యువత లో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే బడ్జెట్ లో ఎక్కడా కూడా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల పేర్లు ప్రస్తావించలేదు అని, ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేస్తూ రాష్ట్రానికి చేయూత ఇచ్చే విధంగా ఎలాంటి అంశాలను బడ్జెట్ లో ప్రస్తావించలేదు అని అన్నారు.సీఎం జగన్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారే తప్ప, రాష్ట్రం గురించి పట్టించుకోవడం లేదు అని అన్నారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయి అని చెప్పిన జగన్, ఇప్పుడు ఎందుకు అడగడం లేదు అని అన్నారు.