గవర్నమెంట్ టెర్రరిజం తో ఏపీ కి చెడ్డ పేరు తీసుకొచ్చారు

Sunday, January 3rd, 2021, 06:53:14 PM IST

yanamala ramakrishnudu

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అప్పులు అత్యధికం, అభివృద్ది ఆత్యల్పం అంటూ అధికార వైసీపీ ప్రభుత్వం పై తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పుల భారం ప్రజలకు, పప్పు బెల్లాలు వైసీపీ నాయకులకు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అంతేకాక ఫిజికల్ మరియు సోషల్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లలో అభివృద్ది శూన్యం అంటూ వ్యాఖ్యానించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు టీ ఏ, డీ ఏ లు, రిటైర్డ్ ఉద్యోగులకు ఫించన్లు సకాలం లో ఇవ్వడం లేదు అంటూ ఆరోపణలు చేశారు. రెవెన్యూ లోటు 1,10,320 కోట్లకు చేరుతోంది అని తెలిపిన యనమల, వైసీపీ అధికారం లోకి వచ్చాక లక్షన్నర కోట్ల రూపాయలు అప్పు చేశారు అని అన్నారు. ఈ మేరకు ప్రజల పై 75 వేల కోట్ల రూపాయల పన్ను వేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్కెట్ లో నిత్యా వసరాల ధరలకు, చేసే సంక్షేమానికి పొంతన లేదు అని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అవినీతి మరియు చేతకాని పాలనతో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కష్టాల్లో ఉన్నారు అంటూ యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్తితి అగమ్య గోచరంగా తయారైంది అంటూ యనమల ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు నిర్ణయాలు, ఎడాపెడా పన్నులు వేసి గవర్నమెంట్ టెర్రరిజం తో ఏపీ కి చెడ్డపేరు తీసుకొచ్చారు అంటూ విమర్శించారు. శాంతి భద్రతల ను అడః పాతాళానికి దిగజార్చారు అని అన్నారు. అయితే ప్రతి పక్షాల పై దాడులు, ప్రజల పై దౌర్జన్యాలు, దేవాలయాల ధ్వంసం లతో రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు అని, ఏపీ ను వైసీపీ నేతలు నేరగాళ్లకు స్వర్గధామం గా మార్చారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న వరుస ఆరోపణలకు, విమర్శలకు యనమల రామకృష్ణుడు గట్టి కౌంటర్ ఇచ్చారు.