అది ముమ్మాటికి అధికార దుర్వినియోగమే.. సీఎం జగన్‌పై యనమల ఫైర్..!

Saturday, November 14th, 2020, 04:12:28 PM IST

yanamala ramakrishnudu

ఏపీ సీఎం జగన్ వైఖరిపై టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. ఈ నెల 18న శారదాపీఠం స్వామీజి స్వరూపానంద పుట్టిన రోజు సందర్భంగా 23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ఈ ఆదేశాలు దేవాలయాల పట్ల, స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ సనాతన సంప్రదాయాలకు వ్యతిరేకమని అన్నారు. కాశీలో తనతో చేయించిన హోమాలకు, స్వామి పట్ల భక్తి ఉంటే సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలని, ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడం స్వామిభక్తి కాదని అన్నారు.

అయితే స్వామి భక్తుడిగా సీఎం మారి యావత్ అధికార యంత్రాంగాన్ని ఒక ప్రైవేటు పీఠం ముందు మోకరిల్లేలా చేస్తున్నారని అన్నారు. ఈ ఆదేశాలు జగన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని మండిపడ్డారు. సీఎం జగన్ రోజుకో వివాదాస్పద ఆదేశాలతో మొత్తం రాష్ట్రాన్ని వివాదాలపాలు చేశారని అన్నారు. ఇకనైనా ఇటువంటి దుందుడుకు నిర్ణయాలకు జగన్ రెడ్డి స్వస్తి చెప్పాలని, ప్రజా సమస్యల పరిష్కారంపై శ్రద్దపెట్టాలని అన్నారు.