ఒక్క హత్య కప్పిపుచ్చుకునేందుకు 9 హత్యలు.. నిందితుడికి ఉరిశిక్ష..!

Thursday, October 29th, 2020, 12:20:23 AM IST

లాక్‌డౌన్ సమయంలో వరంగల్ జిల్లా, గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో 9 శవాలు లభ్యమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఆత్మహత్యలు అనుకున్నా అందరిని ఒక్కడే హత్య చేసి బావిలో పడేశాడని పోలీసుల విచారణలో తేలిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్యల కేసులో నిందితుడు సంజయ్ కుమార్ యాదవ్‌కు తాజాగా వరంగల్ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు.

అయితే ఈ హత్యల వెనుక అసలు వివరాలోకి వెళితే పశ్చిమ బెంగాల్‌ నుంచి ఎండీ మక్సూద్‌ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం కుటుంబంతో సహా వరంగల్‌కు వలస వచ్చాడు. గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గోనె సంచుల తయారీ గోదాంలో పనిచేస్తూ, ఆ గోదాంలోనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తోపాటు ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. అయితే భర్తతో విడిపోయిన మక్సూద్ కుమార్తె బుస్రా కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే వీరితో పాటు బీహార్‌కు చెందిన మరో ఐద్దరు యువకులు కూడా అక్కడే పనిచేస్తూ పక్క గదిలో ఉండేవారు.

అయితే మక్సూద్ కూతురు బుస్రాతో నిందితుడు సంజయ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె పెళ్ళి చేసుకోవాలని సంజయ్‌పై ఒత్తిడి పెంచడంతో తన కుటుంబసభ్యులకు పరిచయం చేస్తానని తీసుకెళ్తూ రైలులో నుంచి తోసేసి ఆమెను చంపేశాడు. అయితే ఊరి నుంచి తిరిగి ఒక్కడే రావడంతో అనుమానం వచ్చిన మక్సూద్ కుటంబ సభ్యులు సంజయ్‌ని నిలదీయగా తాను చేసిన హత్య ఎక్కడ బయటపడుతుందో అని భయపడ్డాడు.

ఇదే తరుణంలో మక్సూద్ కుటుంబంలో ఒకరిది పుట్టిన రోజు రావడంతో సంజయ్ కేక్ లో నిద్రమాత్రలు కలిపి అందరికి ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన తర్వాత మక్సూద్ కుటుంబం మొత్తాన్ని మరియు ఇద్దరు బీహార్ యువకులను బతికి ఉండగానే ఈడ్చుకుంటూ వెళ్లి బావిలో పడేశాడు. దీంతో ఒక్క హత్య నుంచి తప్పించుకోవాలని ఏకంగా తొమ్మిది మందిని హత్య చేసిన ఈ నిందితుడికి న్యాయస్థానం ఉరిశిక్ష ఖరారు చేసింది.