బిగ్ న్యూస్: అసదుద్దీన్ ఓవైసీ కి నిరసన సెగ…ఓట్లు ఎలా అడుగుతారు?

Monday, November 23rd, 2020, 12:38:07 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముంచుకొని వస్తున్నాయి. హైదరాబాద్ లోని కీలక పార్టీలు ప్రచారం వేగవంతం చేశాయి. ఈ మేరకు ఎం ఐ ఎం చీఫ్, ఎంపీ ఓవైసీ అసదుద్దీన్ ప్రచారం చేశారు. అయితే అసదుద్దీన్ కి నిరసన సెగ తగిలింది అని చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదు అని మహిళలు అసదుద్దీన్ ను నిలదీశారు. జాంబాగ్ డివిజన్ లో ఎం ఐ ఎం అభ్యర్ధి రవీందర్ తరపున ప్రచారం లో పాల్గొన్న అసదుద్దీన్ ను అక్కడి స్థానిక మహిళలు వరుస ప్రశ్నలు వేశారు.

అయితే తాము కష్టకాలం లో ఉన్నప్పుడు పట్టించుకోలేదు అని, అటువంటిది ఇప్పుడు ఎన్నికల సమయం లో ఓట్లు ఎలా అడుగుతారు అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే అక్కడి స్థానిక మహిళల ఆగ్రహం తో సమాధానం ఇవ్వకుండానే అసదుద్దీన్ వెనుదిరిగారు. గత నెలలో హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. అందులో ముఖ్యంగా ఓల్డ్ సిటీ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10 వేల రూపాయల సాయం కూడా వారికి అందకపోవడం తో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.