కేసీఆర్ పతనం మొదలయ్యింది.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు..!

Thursday, December 10th, 2020, 09:30:40 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి నిప్పులు చెరిగారు. నేడు హైదరాబాదులోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన విజయశాంతీ ఇక కేసీఆర్ పతనం మొదలైందని, టీఆర్ఎస్ కనుమరుగవటం‌ ఖాయమని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల రక్తం కూడు తింటున్నారని, అమరవీరుల శవాలపై కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్‌తో కాంగ్రెస్‌ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తోందని అన్నారు.

అయితే కేసీఆర్‌ స్వార్థంతో తల్లి తెలంగాణ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నారని, తనను రాజకీయాల నుంచి తప్పించేందుకు కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమయ్యారని అన్నారు. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే తాను అప్పట్లో బీజేపీని వీడానని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నాయకుల మాటలను ప్రజలు ఇకమీదట నమ్మబోరని దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ప్రధాని మోదీ ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేస్తున్నారని, తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు.