మిస్సింగ్ కేసులను సీరియస్‌గా తీసుకోండి.. ప్రభుత్వానికి విజయశాంతి హెచ్చరిక..!

Friday, November 6th, 2020, 02:22:12 AM IST


తెలంగాణలో పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి టీఅర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న మిస్సింగ్ కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, అక్టోబర్ 30 నాటికి ఉన్న పరిస్థితిని గమనిస్తే, అప్పటికి నాలుగు రోజుల కిందటి డేటా ప్రకారం సుమారు 200 మంది కనిపించకుండా పోయినట్లు పోలీస్ శాఖ అధికారిక వెబ్ సైటు వెల్లడించిందని మీడియా తెలిపింది. అయితే, ఒకే రోజున ఏకంగా 65 మంది వరకూ మిస్ అయినట్టు రికార్డవడం మరీ దిగ్భ్రాంతి కలిగిస్తోందని అన్నారు.

ఈ పరిణామాలు తెలంగాణ సమాజంలో కలవరానికి దారి తీయకముందే ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని, ఈ మిస్సింగ్ కేసుల్లో కొద్ది శాతం వ్యక్తిగత, కుటుంబ సంబంధ కారణాలను కలిగి ఉండవచ్చు కానీ అత్యధిక కేసుల్లో నేరపూరిత కోణాలను కొట్టిపడేయలేమని అన్నారు. అయితే గతంలో ఎందరో అభాగ్యులు ఇలాగే కనిపించకుండా పోయి సీరియల్ క్రైమ్స్ చేసే నేరగాళ్ళు, కామాంధుల బారిన పడిన ఘటనలు చూశామని, మాటలతో వివరించలేని రీతిలో పసి మొగ్గల్ని, బాలికల్ని, మహిళల్ని హింసించి బలి తీసుకున్న వ్యధలెన్నో మనం విన్నామని, మిస్సింగులతో ముడిపడిన నేరాలు తర్వాత ఎప్పుడో బయటకొస్తున్నాయని అన్నారు.

దారుణమైన అకృత్యాలు జరిగేదాకా నిర్లక్ష్య ధోరణితో ఉండి నెత్తిమీదకు వచ్చినప్పుడు ఏదో ఒక ఎన్‌కౌంటర్ చేసి చేతులు దులుపుకునే పరిస్థితి తెచ్చుకోవడం ఈ సర్కారు విధానంగా మారిందని ఎద్దేవా చేశారు. తెలంగాణ సర్కారు ఇప్పటికైనా ఈ మిస్సింగ్ కేసులను సీరియస్‌గా తీసుకుని, కేసు నమోదైన వెంటనే పోలీస్ శాఖ స్పందించేలా ఒక వ్యవస్థను రూపొందించాలని, అలా చేస్తే జరగబోయే ఘోరాల్ని అరికట్టి ఎందరో బాధితుల్ని కాపాడే అవకాశముంటుందని, పరిపాలన పరంగా టీఆర్ఎస్ వైఫల్యాల ప్రభుత్వమే అయినా, ప్రజా క్షేమం దృష్ట్యా ఈ బాధ్యతలైనా సక్రమంగా నిర్వర్తించాలని హెచ్చరించారు.