రేపే అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్న విజయశాంతి..!

Saturday, November 28th, 2020, 11:30:23 PM IST

దుబ్బాక గెలుపుతో గ్రేటర్ ఎన్నికల వేళ ఫుల్‌జోష్‌లో ఉన్న బీజేపీలోకి వలసలు పెరిగాయి. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలోని పలువురు అసంతృప్తులు బీజేపీ గూటికి చేరారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీనీ వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

అయితే బీజేపీలో చేరేందుకు విజయశాంతి నుంచి కూడా సంకేతాలు వచ్చాయి. గత వారం ఆమె హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్టు సమాచారం. ఈ సందర్భంగా గ్రేటర్‌లో పార్టీ విజయానికి కృషి చేయాలని నడ్డా విజయశాంతిని కోరినట్టు తెలుస్తుంది. అయితే గ్రేటర్ ప్రచారంలో భాగంగా అమిత్ షా రేపు హైదరాబాద్ రానున్నారు. అయితే అమిత్‌షా సమక్షంలోనే విజయశాంతి కాషాయ కండువా కప్పుకోబోతున్నట్టు తెలుస్తుంది.