కేటీఆర్ కు సీఎం పదవి ఇచ్చేందుకు కేసీఆర్ రంగం సిద్దం – విజయశాంతి

Monday, November 2nd, 2020, 02:20:12 PM IST

తెరాస నాయకులు హరీశ్ రావు పై, దుబ్బాక ఉపఎన్నిక విషయం గురించి ప్రస్తావిస్తూ నటి, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉపఎన్నిక లో బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా హరీశ్ రావు కంటిమీద కునుకు లేకుండా పని చేస్తున్నారు అని విజయశాంతి అన్నారు. కానీ ఈ ఎన్నిక అనంతరం సీఎం కేసీఆర్ హరీశ్ రావు కి షాక్ ఇవ్వబోతున్నారు అని తెలిపారు. జీ హెచ్ ఎం సి నిర్వహించి ఫలితాలు వచ్చిన అనంతరం కేటీఆర్ కి సీఎం పదవి ఇచ్చేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు అని విజయశాంతి అన్నారు. అయితే ఈ వాదనకి బలం చేకూరే విధంగా కేసీఆర్ నోట రాజీనామా మాట గతంలో వచ్చింది అని తెలిపారు.

అయితే బీజేపీ మీద నెపం నెట్టి, పదవికి రాజీనామా చేస్తా అని చెప్పడం భవిష్యత్ రాజకీయాలకు అద్దం పడుతోంది అంటూ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తా అనే అంశాన్ని కొత్త గా తెరపైకి ఎందుకు తీసుకు వచ్చారు అంటూ విజయశాంతి సూటిగా ప్రశ్నించారు. ఒక పక్క హరీశ్ రావు దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం లో బీజేపీ నేతల పై విరుచుకు పడుతుంటే, ఆయన ప్రచారాన్ని డామినేట్ చేసేలా కేసీఆర్ బీజేపీ నేతలకు సవాల్ విసురుతున్నారు అని, అయితే హరీశ్ రావు కి కూడా పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లే అని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక నమ్మిన వారిని మోసం చేయడం లో కేసీఆర్ వ్యవహార శైలి వేరు అని ఘాటు విమర్శలు చేశారు.