దేవుళ్ళకు కూడా ప్రాంతీయవాదం అంటగడుతారా.. రాములమ్మ సూటి ప్రశ్న..!

Friday, January 22nd, 2021, 01:02:50 AM IST


అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా విరాళాల సేకరణ కొనసాగుతోంది. అయితే కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు విరాళాల సేకరణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో యూపీలో ఉన్న అయోధ్య రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దని, మన ప్రానతంలో రాముడి దేవాలయాలు లేవా అని ప్రశ్నించారు. రాముని పేరు మీద భిక్షం ఎత్తుకుంటున్నారని, బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులా.. తామంతా శ్రీరాముని భక్తులమేనని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాస్పదంగా మారాయి. అయితే టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వ్యాఖ్యలకు బీజేపీ నేత విజయశాంతి కౌంటర్ ఇచ్చారు.

దేవుళ్ళకు కూడా ప్రాంతీయవాదం అంటగట్టే వైపరీత్య మనస్తత్వం టీఆర్ఎస్ నేతలకే చెల్లు అని దేశంలో మనది ఏ రాష్ట్రమైనా ముందుగా భారతీయులమనే విజ్ఞత మరచి అయోధ్య రాముడు, తెలంగాణ రాముడంటూ భేదభావాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. అది చాలక అయోధ్య రామాలయానికి విరాళాలివ్వద్దని తమ ద్వేష మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారు. పైగా విరాళాన్ని భిక్షం అంటూ ఆరాధ్య భావంతో చేసే సమర్పణకు, అడుక్కోవడానికి తేడా తెలియని తమ అజ్ఞానాన్ని ప్రజలకు తెలియజేశారని అన్నారు.

మన దగ్గర రాముడి ఆలయాలు లేవా.. అంటున్న ఆ టీఆర్ఎస్ నేత ఇళ్ళలోనే పూజామందిరాలు ఉన్నప్పుడు గుళ్ళకు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం దేనికో చెప్పాలని, ఇలా తలతిక్కగా మాట్లాడి అహంకారాన్ని ప్రదర్శించే టీఆరెస్ నేతలను ప్రజలు తప్పక ఇళ్ళకే పరిమితం చేస్తారనే సంగతి గుర్తుంచుకోవాలని చెబుతూ చివరగా జై శ్రీరాం అంటూ ట్వీట్‌ చేశారు.