యథా ముఖ్యమంత్రి.. తథా ప్రజా ప్రతినిధి – విజయశాంతి

Tuesday, February 2nd, 2021, 01:09:24 AM IST


వరంగల్ జిల్లా పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఓసీ మహాగర్జన సభలో అణగారిన వర్గాలకు చెందిన ఉద్యోగులలో అక్షరం ముక్క రాని వారు ఉన్నతాధికారులుగా ఉన్నారని మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల ప్రతినిధులైన వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన గతంలోని ఉపముఖ్యమంత్రులు రాజయ్య, కడియం శ్రీహరి గార్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విలువ లేకుండా చేసిన అవమానపు ప్రభావమో ఏమో.. ఈ రోజు వరంగల్ టీఆరెస్ పార్టీ నాయకులు.. మొత్తం అణగారిన వర్గాల ప్రజల పైనే కామెంట్స్ చేసే స్థాయికి తెగిస్తున్నారని అన్నారు.

అంతేకాదు “యథా ముఖ్యమంత్రి.. తథా ప్రజా ప్రతినిధి”.. సాక్షాత్తూ సీఎం దళిత ఉపముఖ్యమంత్రులను అవమానకరంగా తీసి పక్కన పడేసినప్పుడు.. నేను కనీసం అణగారిన వర్గాలకు చెందిన ఉద్యోగులను హేళన చెయ్యకూడదా?.. అని అనుకుంటునట్టుంది ఆ వరంగల్ ప్రజాప్రతినిధి తీరు అని విజయశాంతి ట్వీట్ చేశారు.