ఎటు చూసినా వైఫల్యాలే.. కేసీఆర్ సర్కార్‌పై విజయశాంతి కామెంట్స్..!

Monday, May 17th, 2021, 09:14:43 PM IST


తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కోవిడ్ కట్టడి కోసం తెలంగాణకు సరఫరా చేస్తున్న ఆక్సిజన్ 450 నుంచి 650 మెట్రిక్ టన్నులకు రెండెసివర్ ఇంజెక్షన్లను 10 వేలకు పెంచినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన ఆమె రాష్ట్రంలో థర్డ్ వేవ్ పై సర్కారు సన్నద్ధత, బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఏర్పాట్లు, కరోనాకు తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల పరిస్థితిపై హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో పాలకులు చురుకుగా స్పందించి నష్ట నివారణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని, ప్రస్తుతం కొనసాగుతున్న అవాంఛనీయ పరిణామాలపై గతంలోనే సత్వర చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత తీవ్రరూపం దాల్చేది కాదు. రాష్ట్రంలో ఇంకా 6.90 లక్షల పైచిలుకు వ్యాక్సీన్ డోసుల నిల్వ ఉన్నా గత 3 రోజుల నుంచి వాక్సినేషన్ ఆపేశారని, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చలేదు, ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదని మండిపడ్డారు.

అయితే కరోనా కట్టడిపై తెలంగాణ సర్కారు తీరు ఇదంటూ, మరోవైపు మల్లాపూర్‌కు చెందిన ఒక గర్భిణిని చేర్చుకోవడానికి ఐదు ఆస్పత్రులు నిరాకరించి ఆమెను మృత్యుకోరల్లోకి నెట్టిన వైనం అత్యంత వేదన కలిగిస్తోందని, ఎందరో బాధితులు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కుంటున్నారని విజయశాంతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై తక్షణం దృష్టి సారించాలని, ఇంకోపక్క తెలంగాణ రైతు మరోసారి కడగండ్ల పాలు కావడం బాధ కలిగిస్తోందని, వడ్ల కొనుగోళ్ళలో తెలంగాణ సర్కారు ఉదాసీనతతో ధాన్యం వర్షం పాలై రైతులు మరోసారి నష్టపోయారని, తెలంగాణ సర్కారు ఎటు చూసినా వైఫల్యాలే తప్ప పరిస్థితులను చక్కబెట్టేందుకు అవసరమైన ఒక ప్రణాళిక కనిపించడం లేదని విజయశాంతి అన్నారు.