అడిగే నాథుడు లేడనే గర్వంతో మిడిసిపడుతున్నారు.. విజయశాంతి సీరియస్ కామెంట్స్..!

Tuesday, May 4th, 2021, 11:18:22 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజు తల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు తాను అనుకున్నది నెరవేర్చుకోవడానికి కేసీఆర్ గారు విజిలెన్స్, ఏసీబీ, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు సహా సమస్త అధికార గణాన్నీ ఉరుకులు పెట్టించి దర్యాప్తు చేయించి నివేదికలు రప్పించారని, ఆ పని కోసం రికార్డుల తనిఖీలు, బాధితులను విచారించడం లాంటి పనులు చకచకా జరిగిపోయాయి. అవినీతిని సహించేది లేదన్నట్టుగా చూపిన అదే శ్రద్ధ, ఆ పట్టుదల కోవిడ్ కట్టడి విషయంలో ఎందుకు లేదని విజయశాంతి ప్రశ్నించారు.

గత కొద్ది రోజులుగా తెలంగాణలో కోవిడ్ కట్టడికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మందలిస్తూనే ఉందని, మొదటి విషయంలో చూపించిన అమితమైన ఆసక్తి, ఉత్సాహాలను ప్రజారోగ్యం విషయంలో ఎందుకు కనిపించడం లేదని, కరోనా కేసుల నియంత్రణ విషయంలో న్యాయస్థానం వేసిన అక్షింతలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడిన చందంగా ఉందే తప్ప ఏ మాత్రం పట్టింపులేదని అన్నారు. ప్రజల పట్ల ఈ సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటన్నది ఎన్నిమార్లు రుజువవుతున్నా అడిగే నాథుడు లేడనే గర్వంతో మిడిసిపడుతున్నారని, ఈ పరిణామాలను ప్రజలు చూస్తూనే ఉన్నారని విజయశాంతి అన్నారు.