కేసీఆర్ దొరగారు ఇప్పటికైనా గ్రహించండి.. విజయశాంతి సీరియస్..!

Thursday, August 27th, 2020, 09:30:04 AM IST

రాష్ట్రంలో మహిళలకు తగిన రక్షణ కల్పించడంలో కేసీఆర్ సర్కారు విఫలం అయ్యిందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఛైర్‌పర్సన్ విజయశాంతి ఆరోపించారు. నా తెలంగాణలోని ఆడబిడ్డలపై కొందరు హేయమైన నేరాలకు పాల్పడటం తల తీసుకోవాలనే ఆక్రోశాన్ని కల్పిస్తోందని, ఏడాది క్రితం జరిగిన దిశ ఘటన చేసిన గాయాలు ఆరనేలేదు ఇప్పుడు నిజామాబాద్‌లో మరో యువతిపై జరిగిన సామూహిక అత్యాచారం మనసును కలచివేస్తోందని అన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే అమీన్‌పూర్ ఆశ్రమంలో అనాథ బాలిక మృతి ఘటన కలకలం రేపుతూనే ఉంది. ఎన్‌కౌంటర్లు సమర్థనీయం కానప్పటికీ, దిశ ఘటనలో నిందితులు తూటాలకు నేలకొరిగినా పోలీసులంటే ఏ మాత్రం భయంలేక, మహిళా రక్షణ చట్టాలంటే లెక్కలేనితనంతో కామాంధులు చెలరేగిపోతున్నారని, తెలంగాణలో మహిళా రక్షణ చట్టాల అమలు ప్రభావం ఎంత గొప్పగా ఉందో అర్థమవుతూనే ఉంది. తెలంగాణలోని ఈ పరిస్థితులు రాష్ట్రంలోని మహిళలందరినీ తీవ్ర అభద్రతా భావంలోకి నెడుతున్నాయనే వాస్తవాన్ని కేసీఆర్ దొరగారు ఇప్పటికైనా గ్రహించాలని అన్నారు.