కేసీఆర్ గారికి దడపుట్టింది.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు..!

Wednesday, December 16th, 2020, 12:00:16 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి మండిపడ్డారు. అటు దుబ్బాకలోను, ఇటు జీహెచ్ఎంసీలో బీజేపీ దూకుడు దెబ్బకు కేసీఆర్ దొరగారికి ఒక్కసారిగా నిరుద్యోగులు గుర్తుకొచ్చారని, ఉద్యోగార్థులను ఆరేళ్ళుగా పూచికపుల్లలా తీసిపడేసిన సీఎం గారు ఆదరాబాదరాగా 50 వేల ఉద్యోగాల భర్తీ అంటూ పొలికేక పెట్టారని అన్నారు. అయితే మన ఉద్యోగాలు మనకు.. మన నీళ్ళు మనకు అంటూ ఎప్పుడో ఉద్యమకాలంలో నినదించి, అధికారపగ్గాలు అందుకోగానే ఆ విషయం మర్చిపోయారని, బీజేపీ విజయాలు కేసీఆర్ గారికి దడపుట్టించి నిరుద్యోగులు జ్ఞాపకానికి వచ్చారని అన్నారు.

అయితే ఉద్యోగాల భర్తీకి సంబంధించి రెండేళ్ళుగా జోనల్ సిస్టంను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని, టీచర్ల ఏకీకృత సర్వీసు అంశంలో కేంద్రహోంశాఖ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం కూడా ఇవ్వలేదని అన్నారు. రెండు జిల్లాల నిరుద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి నెలకొందని సవరించిన జోన్లకు రాష్ట్రపతి ఆమోదం అవసరమని అన్నారు. ఇవిగాక మరెన్నో చిక్కులు దీనితో ముడిపడి ఉన్నాయని ఇవేమీ తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత తేలిక కాదని నిరుద్యోగులను మరోసారి ధోకా చేసే ప్రయత్నాలను రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సాగవని ఈ మోసాల ముఖ్యమంత్రిగారు గమనించాలని అన్నారు.