కేసీఆర్ రాజకీయాల నుంచి తప్పుకున్నాడనుకున్నా – విజయశాంతి

Tuesday, January 19th, 2021, 05:30:13 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి మండిపడ్డారు. నేడు బీజేపీ మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న రాములమ్మ రాజకీయాల నుంచి కేసీఆర్ తప్పుకున్నాడని తాను అనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు కేసీఆర్ బయటకు రాలేదని, కనీసం వ్యాక్సిన్ వచ్చినప్పుడు కూడా బయటకు వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పే పని చేయలేదని మండిపడ్డారు. ఇకపోతే మహిళలపై అత్యాచారాలను నియంత్రిచడంలో సీఎంగా కేసీఆర్ విఫలమయ్యారని విజయశాంతి అన్నారు.

అంతేకాదు టీఆర్ఎస్‌లో ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి నేతవరకు బూతులు మాట్లాడుతున్నారని, టీఆర్ఎస్ పాలనలో విచ్చలవిడిగా దోపిడీ జరుగుతోందని ఆరోపణలు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం మరో ఉద్యమం రావాల్సిన అవసరం ఉందని, బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ రూపురేఖలు మారుతాయని అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులని వారిని చైతన్యపరచాల్సిన అవసరం ఉందని విజయశాంతి అన్నారు. దుబ్బాక ఉపఎన్నికలో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలు కీలక పాత్ర పోషించారని చెప్పుకొచ్చారు. మహిళలను ప్రోత్సహిస్తే వెనకపడిపోతామని కొంతమంది పురుషులు అనుకుంటారని, మహిళలను గౌరవించడం నేర్చుకోవాలంటూ పరోక్షంగా కేసీఆర్‌పై విజయశాంతి విమర్శలు గుప్పించారు.