పిట్టలదొర కబుర్లే తప్ప చిత్తశుద్ధి లేదు.. కేసీఆర్‌పై మళ్ళీ మండిపడ్డ రాములమ్మ..!

Wednesday, December 23rd, 2020, 01:00:59 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. తెలంగాణ సర్కారు అస్తవ్యస్త పరిపాలనా తీరు దేశవ్యాప్తంగా చులకన చేసే స్థితికి దిగజారిపోయిందని, సీఎం కేసీఆర్ దొరగారు ఉద్యమకాలంలోను, ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు పిట్టలదొర కబుర్లే తప్ప చిత్తశుద్ధి ఏ మాత్రం లేదని తేలిపోయిందని అన్నారు. అయితే కేసీఆర్ దొర హామీతో సన్నవడ్లు పండించిన పాపానికి మద్దతు ధర సైతం దక్కక రైతులు తమ పంటను పక్క రాష్ట్రాలకు అమ్ముకుని బతకాల్సి వచ్చిందని, వీరికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొనుగోళ్ళు లేక మక్క రైతులు రోడ్డుకెక్కారు, అన్నదాతలు పంటలకు మంట పెట్టుకున్నారని అన్నారు.

అంతేకాదు మీరిచ్చిన ఉద్యోగాల హామీని నమ్ముకున్న పలువులు అమాయక నిరుద్యోగులు బలవన్మరణాలకు పాల్పడ్డారని, వివిధ ప్రాజెక్ట్‌ల నుంచి తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా విషయంలో సైతం కేసీఆర్ సర్కారు విఫలమైందని ఆరోపించారు. మొత్తంగా చూస్తే, అటు ఉద్యమ కాలంతో పాటు పాలనా పగ్గాలు అందుకున్న నాటి నుంచి కేసీఆర్ చెబుతూ వచ్చిన “మా నీళ్ళు మాకు.. మా ఉద్యోగాలు మాకు” అనే నినాదం, ఆయన అధికారానికి వచ్చినా సాకారం కాని దారుణ పరిస్థితిలో రాష్ట్రం ఉందని అన్నారు.

ఇక భూసంస్కరణలంటూ కేసీఆర్ సర్కారు ప్రారంభించిన ధరణి వెబ్ సైటు చుక్కలు చూపిస్తోందని, ఇవిగాక డబుల్ బెడ్రూములు, దళితులకు మూడెకరాలు, తాజాగా వరదసాయం, మీ నేతల కబ్జాలు, అవినీతి.. ఇలా చెప్పుకుంటూ పోతే టీఆర్ఎస్ వైఫల్యాల వరుసక్రమానికి ఆకాశమే హద్దు అని మీరిచ్చే హామీలన్నీ ఓట్ల కోసం వేసే గాలాలేనని ప్రజలు బాగా అర్థం చేసుకున్నారని, మీరు వారి మధ్యకెళ్ళినప్పుడల్లా దుబ్బాక, జీహెచ్ఎంసీలను గుర్తు చేస్తూనే ఉంటారన్ చెప్పుకొచ్చారు.