టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు విడదీయలేని సియామీ కవలలు – విజయశాంతి

Thursday, February 11th, 2021, 06:43:16 PM IST

గ్రేటర్ మేయర్‌గా టీఆర్ఎస్ పార్టీ కీలక నేత కేకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలత రెడ్డి ఎన్నికయ్యారు. మేయర్ ఎన్నికలో టీఆర్ఎస్‌కు ఎంఐఎం పార్టీ మద్దతు తెలపడంతో సునాయాసంగా టీఆర్ఎస్ మేయర్ పదవిని దక్కించుకుంది. అయితే తమకు ఎవరి మద్ధతు అవసరం లేదని ముందు నుంచి చెబుతున్న టీఆర్ఎస్ ఎంఐఎం పార్టీ మద్దతు తీసుకోవడంపై బీజేపీ నేతలు విమర్శలు కుప్పిస్తున్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం చీకటి ఒప్పందం ముందు నుంచే ఉందని ఇప్పుడు మరోసారి అది నిరూపణ అయ్యిందని అంటున్నారు.

అయితే తాజాగా దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన బీజేపీ నాయకురాలు విజయశాంతి టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు విడదీయలేని సియామీ కవలలు అని అన్నారు. గతేడాది డిసెంబర్ 4వ నేను చెప్పిన మాటలను ఈ రోజు ఆ రెండు పార్టీలూ మేయర్, డిప్యూటీ ఎన్నికతో మరోసారి బహిరంగం చేసుకున్నాయని అన్నారు.

అసలు డిసెంబర్ 4వ తేదిన విజయశాంతి ఏమని ట్వీట్ చేశారంటే కనీసం 100 డివిజన్లు ఖాయమని జబ్బలు చరిచిన టీఆర్ఎస్ చివరికి మొత్తం స్థానాల్లో దాదాపు మూడోవంతుకు సరిపెట్టుకోవాల్సి వచ్చిందని, గులాబీ నేతల హామీలు నీటి మీద రాతలేనని ఓటర్లు బాగా గ్రహించారని అన్నారు. విపక్షాలకు అవకాశమివ్వకూడదనే కుట్రతో వరుస సెలవులున్నప్పుడు పోలింగ్ శాతం తగ్గుతుందని తెలిసి, రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాల్లో తప్పుల సవరణకు సమయం ఇవ్వలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారు, మృతుల పేర్లు జాబితాల్లో దర్శనమిచ్చాయని, అనుభవం లేని సిబ్బందితో తూతూ మంత్రంగా ఎన్నికలు జరిపేశారని, కాస్త తక్కువ స్థానాలు దక్కినా మేయర్ పదవికి అండగా ఎక్స్‌అఫీషియో ఓట్లున్నాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తీరా చూస్తే ఎంఐఎం మద్దతు లేకుండా టీఆర్ఎస్‌కి మేయర్ సీటు దక్కేలా లేదని, ఇన్నాళ్ళూ కవలల్లా ఉంటూ వచ్చిన ఈ పార్టీలకు కమల పరీక్ష ఎదురైంది.

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో అవసరం లేదని టీఆర్ఎస్ నేతలు.. తల్చుకుంటే గులాబీ సర్కారును 2 నెలల్లో కూల్చుతామని ఎంఐఎం నేతలు బీరాలు పలికారని, మేయర్ పీఠం విషయంలో ఇద్దరూ అదే మాటమీద ఉంటారా? కాదంటే మేయర్ పదవి దక్కకపోయినా ఎంఐఎంతో కలిసేది లేదని హంగ్ కార్పోరేషన్ రానివ్వండి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమని టీఆర్ఎస్ చెప్పాలని కవలల అసలు రంగు బయటపడే సమయం ఇప్పుడు ఆసన్నమైందని అన్నారు.