కవలల అసలు రంగు బయటపడే సమయం ఆసన్నమయ్యింది – విజయశాంతి

Saturday, December 5th, 2020, 01:00:46 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో ఈ సారి టీఆర్ఎస్ దూకుడుకు బీజేపీ బ్రేకులు వేసింది. గతంలో 99 సీట్లు గెలుచుకున్న టీఆర్ఎస్ ఈ సారి 59 స్థానాలలో మాత్రమే గెలిచింది. అయితే మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఖచ్చితంగా ఎంఐఎం మద్ధతు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే టీఆర్ఎస్, ఎంఐఎం మిత్ర పక్షాలు అని ఎన్నికలకు ముందే నుంచే ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్పందించిన విజయశాంతి వీరి పొత్తుపై ట్విట్టర్ వేదికగా వ్యంగస్త్రాలు విసిరారు.

కనీసం 100 డివిజన్లు ఖాయమని జబ్బలు చరిచిన టీఆర్ఎస్ చివరికి మొత్తం స్థానాల్లో దాదాపు మూడోవంతుకు సరిపెట్టుకోవాల్సి వచ్చిందని, గులాబీ నేతల హామీలు నీటి మీద రాతలేనని ఓటర్లు బాగా గ్రహించారని అన్నారు. విపక్షాలకు అవకాశమివ్వకూడదనే కుట్రతో వరుస సెలవులున్నప్పుడు పోలింగ్ శాతం తగ్గుతుందని తెలిసి, రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్ళారు. కొత్త ఓటర్ల నమోదు, జాబితాల్లో తప్పుల సవరణకు సమయం ఇవ్వలేదు. ఇతర ప్రాంతాలకు వెళ్ళినవారు, మృతుల పేర్లు జాబితాల్లో దర్శనమిచ్చాయని, అనుభవం లేని సిబ్బందితో తూతూ మంత్రంగా ఎన్నికలు జరిపేశారని, కాస్త తక్కువ స్థానాలు దక్కినా మేయర్ పదవికి అండగా ఎక్స్‌అఫీషియో ఓట్లున్నాయని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తీరా చూస్తే ఎంఐఎం మద్దతు లేకుండా టీఆర్ఎస్‌కి మేయర్ సీటు దక్కేలా లేదని, ఇన్నాళ్ళూ కవలల్లా ఉంటూ వచ్చిన ఈ పార్టీలకు కమల పరీక్ష ఎదురైంది.

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎంతో అవసరం లేదని టీఆర్ఎస్ నేతలు.. తల్చుకుంటే గులాబీ సర్కారును 2 నెలల్లో కూల్చుతామని ఎంఐఎం నేతలు బీరాలు పలికారని, మేయర్ పీఠం విషయంలో ఇద్దరూ అదే మాటమీద ఉంటారా? కాదంటే మేయర్ పదవి దక్కకపోయినా ఎంఐఎంతో కలిసేది లేదని హంగ్ కార్పోరేషన్ రానివ్వండి మళ్ళీ ఎన్నికలకు సిద్ధమని టీఆర్ఎస్ చెప్పాలని కవలల అసలు రంగు బయటపడే సమయం ఇప్పుడు ఆసన్నమైందని అన్నారు.