ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు..!

Sunday, November 8th, 2020, 06:04:24 PM IST

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీనీ వీడి బీజేపీలో చేరబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెను బుజ్జగించేందుకు ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్యం ఠాకూర్ కూడా ఆమెతో భేటీ అయ్యారు. ఇలాంటి నేపధ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితులపై విజయశాంతి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత సీఎం కేసీఆర్ గారికి సరిగ్గా వర్తించే సమయం సమీపించిందని అన్నారు. కాంగ్రెస్ నేతలు కొందరిని ప్రలోభపెట్టి, ఇంకొందరిని భయపెట్టి, ఒత్తిళ్ళతో ఎమ్మెల్యేలను పార్టీ మార్పించారని అన్నారు. కాంగ్రెస్‌ను బలహీనపరిచే ప్రక్రియ వల్ల ఇప్పుడు మరో జాతీయ పార్టీ బీజేపీ తెలంగాణలో సవాలు విసిరే స్థాయికి వచ్చిందని, మరికొంత ముందుగానే మాణిక్యం ఠాకూర్ గారు రాష్ట్రానికి వచ్చి ఉంటే పరిస్థితులు మెరుగ్గా ఉండేవి కావచ్చు. ఇప్పుడిక కాలము, ప్రజలే నిర్ణయించాలని చెప్పుకొచ్చారు.