బీజేపీలో చేరిన విజయశాంతి.. కేసీఆర్‌పై నిప్పులు..!

Monday, December 7th, 2020, 03:38:03 PM IST

తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీనీ వీడి బీజేపీలో చేరారు. గత రెండు నెలలుగా రాములమ్మ బీజేపీలో చేరుతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తూ వచ్చాయి. అయితే రెండ్రోజులుగా ఢిల్లీలో ఉన్న రాములమ్మ నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీకాంగ్రెస్‌కు రాములమ్మ పార్టీ మారడం ఒకింత షాక్ అనే చెప్పాలి.

అయితే ఈ సందర్భంగా మాట్లాడిన విజయశాంతి సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి చెప్పిన కేసీఅర్ చివరికి యూటర్న్ తీసుకున్నారని అన్నారు. కేసీఆర్ కుట్రతోనే నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆరోపించారు. తెలంగాణలో అత్యధికంగా అవినీతి జరుగుతుందని దీనిని ఖచ్చితంగా బయటపెడతానని అన్నారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారిందని, రాబోయే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ అధికారాన్ని చేపట్టడం ఖాయమని అన్నారు.