వాణీ దేవీ కి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ప్రాయశ్చిత్తం అవుతుందా?

Monday, March 1st, 2021, 09:23:51 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాల పై, సీఎం కేసీఆర్ పట్ల ప్రముఖ నటి, మాజీ ఎంపీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. కరీం నగర్ జిల్లా బ్రాహ్మణ హత్య పాపాల్ని కౌన్సిల్ బీ ఫారం తో కడిగేసుకుందామన్న కుట్ర చెల్లుతుందా అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వామనరావు దంపతుల పై బ్రహ్మ హత్య పాతకానికి పాల్పడి, వాణీ దేవి కి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే ప్రాయశ్చిత్తం అవుతుందా అని కేసీఆర్ గారి చర్యలను ఆవేదనతో రగిలి పోతున్న బ్రాహ్మణులు అంతర్గత సమావేశాలలో ఆత్మ సాక్షి గా ప్రశ్నించుకుంటున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది అని వ్యాఖ్యానించారు.

అయితే మంథాని లో చేసిన పాపానికి మల్కాజ్ గిరితో పాటు మూడు ప్రాంతాలకి చెందిన బ్రాహ్మణ ఓటర్ల తో ప్రక్షాళన చేసుకోవాలని సీఎం దొరగారు చేస్తున్న కపట ప్రయత్నాలను అర్దం చేసుకోలేని అమాయక స్థితిలో బ్రాహ్మణ సామాజిక వర్గం లేదు అని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకు పీవీ గారి బిడ్డ వాణీ దేవి ను బరిలోకి దించిన కేసీఆర్ గారు, వామనరావు హత్యకు కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెబితే తప్ప, ఓట్లు అడిగే నైతిక హక్కు ఉండదు అన్న స్పష్టమైన వైఖరి తో బ్రాహ్మణ సమాజం ఉన్నట్లు కనిపిస్తోంది అని అన్నారు. పీవీ గారి కుమార్తెకు టికెట్ కేటాయించానని ప్రచారం చేసుకుంటున్న గులాబీ బాస్, బీజేపీ అభ్యర్థి గా బరిలోకి దిగుతున్న రామ చందర్ రావు గారికి పడే బ్రాహ్మణ ఓట్లను చీల్చడానికి కుట్ర చేస్తున్నారు అనేది వాస్తవం అని మొత్తం తెలంగాణ సమాజపు అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చారు.