కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే సమయం దగ్గర పడింది – విజయశాంతి

Thursday, April 15th, 2021, 03:00:11 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నేడు మీడియా సమావేశంలో మాట్లాడిన విజయశాంతి కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయే సమయం దగ్గర పడిందని అన్నారు. ఓడిపోతామన్న భయం కేసీఆర్ కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తుందని అందుకే నేడు హాలియాలో రెండో సారి సభ నిర్వహించారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, జానారెడ్డిలు ఇద్దరు తోడు దొంగలని వారి మాటలను సాగర్ ప్రజలు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు కేసీఆర్‌తో డీల్ కుదుర్చుకున్నారని అందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరారని ఆరోపించారు.

అయితే 2009లో కేసీఆర్ చేసిన దొంగ నిరాహార దీక్ష వల్ల తెలంగాణ రాలేదని ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చిందని అన్నారు. సీఎం పదవి తనకు చెప్పుతో సమానం అన్న కేసీఆర్ ఇప్పుడేమో ప్రజల భిక్ష అంటున్నారని, ముఖ్యమంత్రి పదవిపై కేసీఆర్ పూటకో మాట మాట్లాడుతున్నారని విజయశాంతి అన్నారు. అంబేడ్కర్ జయంతికి కనీసం నివాళులర్పించలేని పరిస్థితి కేసీఆర్‌ది అని, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి అవసరం లేదని ప్రజలు అనుకుంటున్నారని, సరైన సమయంలో టీఆర్ఎస్ అవినీతిని ప్రజల ముందుంచుతామని విజయశాంతి హెచ్చరించారు.