ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.. విజయశాంతి ఆవేదన..!

Wednesday, September 30th, 2020, 10:33:30 AM IST

దేశంలో మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్రంగా స్పందించారు. స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆమె ఫేస్‌బుక్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో.. రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో.. అంటూ స్త్రీలపై దేశంలో జరుగుతున్న దారుణాల గురించి విన్నప్పుడల్లా ప్రతిఘటన చిత్రంలోని ఈ పాటే నాకు గుర్తుకొస్తుందని అన్నారు.

అయితే ఒకప్పుడు యావద్దేశాన్నీ కుదిపేసిన నిర్భయ ఘటన, తెలుగు రాష్ట్రాలను కన్నీరు పెట్టించిన దిశ ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయని, ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల తన పిల్లలతో కలసి బస్సు ఎక్కిన ఒక వివాహితపై ఇద్దరు డ్రైవర్లు దారుణంగా అత్యాచారం చేసి ఈ సమాజపు చేతగానితనాన్ని వెక్కిరించారని అన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా, ఎందరు పోలీసులు ఉన్నా, నైతికంగా సమాజం శక్తిమంతం కానంత వరకూ ఈ వ్యవస్థలో ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయని, తల్లిదండ్రులలో ఎంతమంది ఆడపిల్లల పట్ల గౌరవం పెరిగేలా తమ ఇంట్లోని అబ్బాయిలను తీర్చిదిద్దుతున్నారు అని, ఈ ప్రశ్నకు సంతృప్తికరమైన జవాబు లభించే పరిస్థితి నేడు కనిపిస్తోందా అని, బాధిత కుటుంబాలను చూసి అయ్యో అని జాలి పడి ఆగిపోవద్దని అన్నారు. రేపటి బిడ్డలు కూడా ఇదే సమాజంలోకి అడుగుపెడతారన్న వాస్తవాన్ని మరచిపోవద్దని, మన మనుగడకు, జాతి గౌరవానికి మూలం మహిళేనని గుర్తించి ఇప్పటికైనా మేలుకోండని, స్త్రీ గర్వపడేలా మన సమాజాన్ని మలుచుకుందామని పిలుపునిచ్చారు.