కేసీఆర్ ఫామ్ హౌస్‌లో ఓట్లు లెక్కిస్తారేమో.. విజయశాంతి అనుమానం..!

Wednesday, October 28th, 2020, 11:31:46 PM IST

దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయశాంతి హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని, దీన్నిబట్టి ఎన్నికలకు ముందే ఫలితాలు ఏ విధంగా ఉండాలో టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించే స్థాయికి వెళ్లి పోయిందంటే అధికార పార్టీ అరాచకాలపై దుబ్బాక ఓటర్లకు ఓ స్పష్టత వచ్చి ఉంటుందని అన్నారు.

అంతేకాదు హరీష్ రావు గారి కామెంట్ చూస్తూ ఉంటే దుబ్బాకలో పోలింగ్ జరిగిన తర్వాత కేసీఆర్ గారి ఫామ్ హౌస్‌లో ఈవీఎం మిషన్లను పెట్టి, ఓట్లను లెక్కిస్తారో ఏమో అనే అనుమానం కలుగుతోందని అన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే మరణించడంతో జరిగే ఉప ఎన్నిక విషయంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హరీష్ రావు గారు ఎందుకు ఇంత హైరానా పడుతున్నారో ఎవరికి అంతుబట్టడం లేదని, కాంగ్రెస్, బీజేపీలకు గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఉప ఎన్నికలో ఎక్కువ ఓట్లు వస్తే దాని ప్రభావం హరీష్ రావు గారి మంత్రి పదవి మీద పడుతుందని సీఎం కేసీఆర్ గారు ఏదన్నా అల్టీమేటం జారీ చేశారా అన్న చర్చ కూడా జరుగుతోందని అందుకే తెలంగాణ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మెదక్ జిల్లాకు కేటాయించిన నిధుల కంటే దుబ్బాకలో ఓటర్లను కొనేందుకు ఖర్చు చేస్తున్న డబ్బు ఎక్కువగా ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారని విజయశాంతి ఎద్దేవా చేశారు.