రామాలయానికి అనుకూలమా? కాదా? స్పష్టమైన ప్రకటన చేయాలి

Monday, February 1st, 2021, 10:19:57 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై మరోమారు నటి, బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాస ఎమ్మెల్యేలు అయోధ్య రామాలయం అంశంలో తరచు గా భద్రాద్రి ఆలయం గురించి ప్రస్తావిస్తున్నారు అని అన్నారు. అయితే అయోధ్య రామాలయాన్ని దేశ ప్రజలు అందరూ భక్తి భావం తో రామయ్య జన్మభూమి లో స్వచ్ఛందంగా నిర్మించుకుంటున్నారు అని విజయశాంతి పేర్కొన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి లాగే భద్రాద్రి లో కూడా ఆలయాన్ని గొప్పగా తీర్చి దిద్దితే ప్రజలందరూ అందుకు హర్షిస్తారు అంటూ చెప్పుకొచ్చారు. భక్తి తో ఆ కార్యక్రమంలోనూ పాలు పంచుకుంటారు అని,కానీ సీఎం కేసీఆర్ గారికి అది సహించకో ఏమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఏపీ లో కలిసిన మండలాలు వెనక్కి వస్తే భద్రాద్రిలో బ్రహ్మాండం గా నిర్మాణాల అభివృద్ధి చేపడతాం అని మంత్రులతో మెలికలు పెట్టిస్తున్నారు అంటూ విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందరు తెరాస ఎమ్మెల్యేలు అయోధ్య కి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఖండించలేని సీఎం గారు, రామాలయానికి అనుకూలమా కాదా స్పష్టంగా ప్రకటన చేయాలి అంటూ డిమాండ్ చేశారు. లేదా నేను మాటల్లోనే హిందువు ను అని, అయోధ్య విషయం లో ఎం ఐ ఎం కి అసలైన బంధువును అని చెబుతారో కేసీఆర్ తేల్చుకోవాలి అంటూ విజయశాంతి పేర్కొన్నారు. అయితే మరొకసారి విజయశాంతి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.