టీఆర్ఎస్ సర్కార్‌కు కాలం చెల్లే రోజులు దగ్గరపడ్డాయి – విజయశాంతి

Tuesday, January 19th, 2021, 12:04:54 AM IST

తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి కేసీఆర్ సర్కార్‌పై మండిపడ్డారు. ఆదరాబాదరాగా నిర్ణయాలు తీసుకోవడమే గాని, ఆ నిర్ణయాల అమలుకు తగిన ఏర్పాట్లు చెయ్యడంలో తెలంగాణ సర్కారు విఫలమవుతూనే ఉందని, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొన్ని తరగతుల కోసం పాఠశాలలను తిరిగి తెరవాలని నిర్ణయించింది గానీ, కోవిడ్ నిబంధనల్ని పాటించే పరిస్థితులు లేవని అన్నారు. తెలంగాణలో వందలాది పాఠశాలలను మరుగుదొడ్ల సమస్య, నీటి సమస్య వేధిస్తున్నాయి. ఇవి అమ్మాయిలకు మరింత ఇబ్బందిగా పరిణమిస్తున్నాయని అన్నారు. తాజాగా గణాంకాలతో సహా మీడియాలో కథనాలు వచ్చాయని అన్నారు.

కరోనా వ్యాప్తికి ముందే ఈ సమస్యలున్నా తెలంగాణ సర్కారు ఏనాడూ వీటిపై దృష్టి సారించలేదని, ఫలితంగా బాలికల డ్రాపౌట్ల సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చిందని, వీటికి తోడు పారిశుద్ధ్య సిబ్బంది కొరత కూడా ఉందని, అప్పుడే ఏమీ చెయ్యని ఈ అసమర్ధ, అవినీతి ప్రభుత్వం ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో చేతులెత్తెయ్యడం తప్ప ఈ పరిస్థితిని మెరుగుపరుస్తుందన్న ఆశలు ఏ మాత్రం లేవని అన్నారు. మరోవైపు కాలేజీల్లో లెక్చరర్ల కొరత, హాస్టల్ సదుపాయాల్లో ఇబ్బంది లాంటి మరి కొన్ని సమస్యలున్నాయని, పరిస్థితులు కాస్తో కూస్తో బాగున్నప్పుడే విద్యా వ్యవస్థ మెరుగుదలపై దృష్టి పెట్టని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడేదో ఉద్ధరిస్తుందనుకోవడం వెర్రితనం తప్ప మరొకటి కాదని అన్నారు. ఏ సమస్య వచ్చినా చేతులు ముడుచుకు కూర్చునే టీఆర్ఎస్ సర్కారుకు కాలం చెల్లే రోజులు దగ్గర పడుతున్నాయని గ్రహించాలని అన్నారు.