కరోనా కట్టడి చర్యల్లో తెలంగాణ సర్కార్ విఫలమయ్యింది – విజయశాంతి

Wednesday, March 24th, 2021, 01:47:55 AM IST


కరోనా కట్టడి చర్యల్లో తెలంగాణ సర్కార్ విఫలమయ్యిందని బీజేపీ నాయకురాలు విజయశాంతి మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన రాములమ్మ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కారు ఏ పని చేసినా అరకొరగానే ఉంటుందనడానికి రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్ని చూస్తే అర్థమవుతుందని, విద్యార్థుల్లో కరోనా వ్యాపిస్తున్నందున వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు విద్యా సంస్థల మూసివేతకు నిర్ణయం తీసుకున్నారని కానీ, మిగిలిన చోట్ల కట్టడికి ఏం చర్యలు తీసుకున్నారన్నది గమనిస్తే శూన్యమని అన్నారు.

అయితే సూర్యాపేటలో నిన్న అనేకమంది గాయాలపాలైన కబడ్డీ పోటీల నిర్వహణ తీరు చూస్తే ప్రధానంగా రెండు తప్పులను అందరూ ఎత్తి చూపుతున్నారని, ఇక్కడ కోవిడ్ నియంత్రణ చర్యలేవీ తీసుకోలేదు సరి కదా.. గ్యాలరీ సామర్థ్యాన్ని పరీక్షించడంలో నిర్వాహకులు, అధికారులు విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయని, ఈ ఒక్క చోటే కాదు, తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కోవిడ్ కట్టడికి తగిన చర్యలు అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదని అన్నారు. అంతేకాదు అధికారులకు సరైన మార్గదర్శకాలు ఇచ్చి పరిస్థితి అదుపు తప్పకుండా చెయ్యడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, పక్కనే ఉన్న మహారాష్ట్రలోని పరిస్థితుల్ని చూసైనా తెలంగాణ సర్కారు మేలుకోకుండా ఈ పాలకుల పాపాన్ని ప్రజలు అనుభవించాల్సి వస్తుందేమోనన్న ఆందోళన కలుగుతోందని అన్నారు.