గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసమే.. వరద సాయంపై విజయశాంతి కామెంట్స్..!

Thursday, November 19th, 2020, 03:00:31 AM IST

గ్రేటర్ హైదరాబాద్‌లో వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో భారీవర్షాల వల్ల బాధితులైన ముంపు ప్రాంతాల ప్రజలకు వరద సాయం పేరిట కేసీఆర్ దొరగారి సర్కారు ఓట్ల రాజకీయానికి పాల్పడిందనడం కాదనలేని సత్యం అని అన్నారు. భారీ వర్షాలు కురిసి దాదాపు 3 వారాలు దాటుతున్నా తెలంగాణ సర్కారు ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందించలేకపోయిందని, ఇచ్చిన పరిహారం కూడా అపహాస్యం పాలైందని, టీఆర్ఎస్ నేతలు సూచించినవారికి మాత్రమే… అదీ చాలావరకూ అరకొరగా ఇచ్చి, నిజమైన బాధితులను విస్మరించి విమర్శలపాలయ్యారని, ఇప్పుడు బల్దియా ఎన్నికలు కేవలం 2 వారాలే ఉన్న నేపథ్యంలో పరిహారం అందని వరద బాధితుల్ని మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోమని చెప్పి, వారిని ఊపిరాడకుండా చేసి ఒక మహిళ మృతికి కూడా కారణమయ్యారని అన్నారు.

ఒకరకంగా చెప్పాలంటే ఈ చర్య గ్రేటర్ ఎన్నికల కోసం ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నమే అని టీఆర్ఎస్ కుట్రను ఎన్నికల సంఘం గుర్తించి, ఎన్నికలయ్యే వరకూ వరద సాయం ఆపమని ఆదేశిస్తే ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చెయ్యడం వల్లే సాయం ఆపామనడం “అడలేక మద్దెల ఓడు” అన్నట్టుందని, ఈ పరిస్థితులను చూస్తుంటే ఇదంతా ప్రభుత్వం చేతగానితనం కంటే గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం ఉద్దేశ్యపూర్వకంగానే వరదసాయాన్ని జాప్యం చేసినట్లు స్పష్టమవుతోందని, ఓటర్లు కేసీఆర్ దొరగారి కుట్రను అర్థం చేసుకోలేనంత వెర్రివాళ్ళు కాదని అన్నారు.