హోంమంత్రి మహమూద్ అలీ ఓటు వివాదం.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు..!

Monday, March 15th, 2021, 11:05:43 PM IST

తెలంగాణలో నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్‌లో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశాననేది బహిరంగంగా ప్రకటించడం తీవ్ర దుమారం రేపుతుంది. దీనిపై స్పందించిన బీజేపీ నాయకురాలు విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ గారు తాను ఏ పార్టీ అభ్యర్థికి ఓటు వేశాననేది బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల నియమావళిని కాలరాసిన హోంమంత్రి ఓటు చెల్లదు. కానీ, ఆయనపై నిన్న ఎవరూ ఫిర్యాదు చెయ్యలేదని, ఆర్వో ఫిర్యాదు అందిన వెంటనే ఓటుపై పరిశీలిస్తామని అధికారులు అన్నారు. హోంమంత్రి ఎవరికి ఓటేశారో స్వయంగా ఆయనే నిబంధనలకు విరుద్ధంగా మీడియా వద్ద బహిరంగంగా చెప్పిన తర్వాత.. వెంటనే చర్య తీసుకోకుండా ఫిర్యాదు కోసం ఎదురు చూడటం ఏంటో అర్థం కావడం లేదని విజయశాంతి అన్నారు.

అయితే లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేల ఎన్నికలకు వ్యయపరిమితిని విధించిన ఎన్నికల సంఘం.. ఎమ్మెల్సీల విషయంలో అలాంటిదేమీ పెట్టకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ విచ్చల విడిగా కోట్లాది రూపాయల ధనాన్ని ప్రకటనలు, ప్రచారం కోసం.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఖర్చు చేసిందని, రాజ్యాంగ వ్యవస్థలంటే తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రివర్యులకు ఏ మాత్రం పట్టదు. పాలనను గాలికొదిలేసిన సర్కారు ఇది. పదే పదే హింసకు గురవుతున్న భైంసా పట్టణమే ఇందుకు అతి పెద్ద ఉదాహరణ అని రాములమ్మ అన్నారు.

పలుమార్లు శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారి, లూటీలు, దాడులు, హత్యలు యథేచ్ఛగా జరుగుతూ భైంసా ప్రజలు బిక్కుబిక్కుమని బతుకుతుంటే.. రోమ్ నగరం తగలబడుతున్నప్పుడు ఫిడేలు వాయించిన నీరోను గుర్తు చేస్తున్నారు సీఎం కేసీఆర్ గారు అని, హోమ్ మినిస్టర్ ఓటు వేసిన పోలింగ్ బూతు నీ అక్కడ వేసిన ఓట్లను పూర్తిగా రద్దు చేయాలని, మళ్ళీ రీ పోలింగ్ నిర్వహించాలని అన్నారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉండి ఎన్నికల సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అని కూడా తెలియని మన హోమ్ మినిస్టర్ గారు చాలా గొప్ప వాళ్ళు యధా రాజా తథా మంత్రులు అని ఎద్దేవా చేశారు.