కేసీఆర్ లెక్కలన్నీ తారుమారుకాబోతున్నాయి.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు..!

Tuesday, November 17th, 2020, 11:00:56 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా, టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ గారు దొరహంకార గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని, ఈ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు జిహెచ్ఎంసి ఎన్నికల్లో 100 సీట్లకు పైగా గెలుస్తామని వాస్తవదూరమైన ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఓటర్లను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అల్లావుద్దీన్ అద్భుతదీపం మాదిరిగా, అసదుద్దీన్ అద్భుతదీపంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఏమైనా అద్భుతాలు జరుగుతాయని సీఎం దొరగారు ఆశలు పెంచుకున్నారని అర్థమవుతోందని అన్నారు.

చాలా ఏళ్ల పాటు గెలిచిన నియోజకవర్గాల్లో ఏమాత్రం అభివృద్ధి చేయకుండా, విద్వేష ప్రసంగాలతో మాయమాటలు చెప్పి పాతబస్తీ ఓటర్లను మోసం చేయడంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అందె వేసిన చేయిగా మారిపోయారని విమర్శించారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే ఓటర్లను మాయ చేసి ఎన్నికలలో ఓట్లు రాబట్టుకునే ఫార్ములా గురించి కేసీఆర్ గారు ఎంఐఎం అధినేతతో మంతనాలు జరిపారన్న ప్రచారం జరుగుతోందని అన్నారు.

గత ఎన్నికలలో కేసీఆర్ గారి హామీలపై భ్రమలు పెంచుకున్న గ్రేటర్ ఓటర్లు ఈసారి మాత్రం టీఆర్ఎస్ అభ్యర్ధులకు తగిన గుణపాఠం నేర్పేందుకు సిద్ధమవుతున్నారని, ఎంఐఎంతో కలిసి జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఎన్ని జిమ్మిక్కులు చేయాలనుకున్న సీఎం దొరగారు వేసుకున్న లెక్కలన్నీ ఈసారి తారుమారు కాబోతున్నాయని ఈ మధ్య కాలంలో ఓటర్ల నాడిని చూస్తే అనిపిస్తోందని విజయశాంతి అన్నారు. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ మేయర్ పదవి ఈ పర్యాయం “మేసేవారికి” కాక “మేయరు..” అనే వారికి దక్కాలని ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారన్నది వాస్తవమని అన్నారు.