ఇది నిజాం పాలన, రాజుల కాలం కాదు.. విజయశాంతి కీలక వ్యాఖ్యలు..!

Saturday, February 13th, 2021, 01:00:21 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి సెటైర్లు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు జరిగిన ప్రచారసభల్లో ప్రతిపక్షాలను ఉద్దేశించి సాక్షాత్తూ సీఎం అత్యంత అసభ్యకరంగా మాట్లాడటం ప్రజలు చూశారని, ఇటీవల జరిగిన హాలియా సభలో బాధిత మహిళలను కుక్కలు అనడం చూశామని అన్నారు. గతంలో ఎన్నోసార్లు అనేకమంది నాయకులు, పార్టీలను, ప్రజలను అవమానకరంగా దుర్భాషలాటడం చూశాము. ఇప్పుడు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లకు భాష, ప్రవర్తన, నియమావళి గురించి అదే ముఖ్యమంత్రి గారు చెబితే వినవలసి రావడం విడ్డూరమని ఎద్దేవా విజయశాంతి చేశారు.

కనీస రాజకీయ సంస్కారం కూడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే ఈ సీఎం గారిని ఒక్క మాట ఎదిరించి అనరాదని టీఆరెస్ పార్టీ మంత్రులు, ముఖ్యనేతలు ఇయ్యాల అరుపులు, పెడబొబ్బలు పెడుతున్నారు. ఇది నిజాం పాలన, రాజుల కాలం కాదు.. ప్రజాస్వామ్యం. ఏది ఏమైనా కరోనా రెండో డోసుకు ఆరోగ్యశాఖ సిద్ధమవుతున్నట్లే తెరాసకు దుబ్బాక, జీహెచ్ఎంసీ తీరున మరో డోసు ఇయ్యనీకి రానున్న ఎమ్మెల్సీ, సాగర్, కార్పోరేషన్‌ల ఎన్నికల కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఒకనాడు తెలంగాణకు కాపలా కుక్కగా ఉంటానన్న ముఖ్యమంత్రి ఇయ్యాల తెలంగాణ ప్రజలనే కుక్కలు అనబడితే.. అందుకు పరిష్కారమేంటో ప్రజలకు తెల్వదా అని ప్రశ్నించారు.