ఆ పార్టీలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌ది – విజయశాంతి

Monday, February 8th, 2021, 10:30:25 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ తప్ప మిగతా ప్రాంతీయ పార్టీలు దెబ్బతిన్నాయని కేసీఆర్ గారు అన్నట్టు వార్తలు వచ్చాయని, అయితే ఇతర ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించకుండా కోవర్టు ఆపరేషన్లతో, కుట్రలతో అబద్ధపు దుష్ప్రచారాలతో ఎన్నో దుర్మార్గాలు చేసి, ఆ తర్వాత చర్చలని చెప్పి ఆ పార్టీలను తెలంగాణ ఐక్యత పేరుతో విలీనం చేయించి, ఆ పార్టీలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్ గారిదే అని అన్నారు.

అయితే తన కుర్చీ కుమారుడికి మారుతుందని అన్నందుకే ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయి నేతలను బండకేసి కొడతానని, పార్టీ నుండి ఊడపీకుతానని ఎగిరి, దుమికి తిట్టబట్టిన కేసీఆర్ గారు తన సీఎం పదవి ఎడమ కాలి చెప్పుతో సమానం అని చెప్పడం విడ్డూరం. అంత లెక్కలేని దానికి ఇన్ని తిట్లు, శాపనార్థాలు ఎందుకో అని అన్నారు. సీఎం పదవి గురించి మాట్లాడితే ఇంత ఆగం అవుతున్న కేసీఆర్ గారు, అయోధ్య గురించి, రిజర్వేషన్ ఉద్యోగుల గురించి అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కనీసం ఖండన చెయ్యకపోవడం గమనార్హం అని అన్నారు.