అంతర్వేది ఘటన వెనుక చంద్రబాబు హస్తం – విజయసాయి రెడ్డి

Friday, September 11th, 2020, 04:30:39 PM IST

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ రథం దగ్ధమైన ఘటన తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపింది. అయితే ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ హిందూ ధార్మిక సంఘాల నేతలు, బీజేపీ, జనసేన నేతలు తీవ్ర నిరసనలు వ్యక్త్రం చేస్తున్నాయి. ఇక దీనిపై ప్రతిపక్ష టీడీపీ కూడా ప్రభుత్వ వైఫల్యమే అంటూ ఆరోపణలు చేస్తుంది.

అయితే ఈ ఘటనపై అసలు నిజాలను బయటపెట్టేందుకు ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అప్పచెప్పినప్పటికి రాజకీయ రగడ మాత్రం ఆగడం లేదు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రథం దగ్ధం వెనుక చంద్రబాబు నాయుడు, ఆయన అనుచరుల హస్తం ఉందంటూ సంచలన ఆరోపణలు చేశాడు. హైదరాబాద్‌లో ఉంటూ విజయవాడలో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతర్వేదిలో గలాటా సృష్టించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని ఈ కేసును సీబీఐకి అప్పచెప్పామని త్వరలోనే చినబాబు, పెదబాబు హస్తం బయటపడుతుందని అన్నారు.