గంటా వచ్చినా, రాకున్నా వైసీపీకి ఎలాంటి నష్టం ఉండదు – విజయసాయి రెడ్డి

Thursday, March 4th, 2021, 02:41:36 AM IST


గ్రేటర్ విశాఖ మున్సిపల్ ఎన్నికలకు ముందు విశాఖ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ప్రధాన అనుచరుడు కాశీవిశ్వనాధ్ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో గంటా కూడా వైసీపీలో చేరబోతున్నారని, అందుకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా పంపించారని విజయసాయి కామెంట్స్ చేశారు. అయితే విజయసాయి వ్యాఖ్యలపై మంత్రి గంటా స్పందిస్తూ ఐదు రోజుల్లో ఎన్నికలు ఉండగా ఇది విజయసాయి మైండ్ గేమ్ లో భాగం అని గంటా అన్నారు.

అయితే తాను ప్రతిపాదనలు పెట్టిన మాటే నిజమైతే వాటిని విజయసాయిరెడ్డే బయటపెట్టాలని గంటా అన్నారు. పార్టీ మారాల్సి వస్తే అందరికీ చెప్పే వెళ్తానని అందులో ఎలాంటి దాపరికం లేదని చెప్పుకొచ్చారు. అయితే గంటాకు కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి మైండ్ గేమ్ ఆడాల్సిన అవసరం వైసీపీకి లేదని, ఆ పార్టీలో చేరేందుకు గంటా తన అభిలాషను వ్యక్తం చేశారు అని, సీఎం జగన్ ఎప్పుడు అంగీకరిస్తే ఆ రోజు మేము పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.