చంద్రబాబుకు నిమ్మగడ్డ తొత్తులా వ్యవహరిస్తున్నాడు – విజయసాయి రెడ్డి

Friday, January 29th, 2021, 03:48:33 PM IST

ఏపీలో పంచాయితీ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో వైసీపీ సర్కార్‌కు, ఎస్‌‌ఈసీ నిమ్మగడ్డకు మధ్య మాటల యుద్ధం ఆగడంలేదు. నేడు ఢిల్లీలో మీడియా సమావేశంలో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు నిమ్మగడ్డపై నిప్పులు చెరిగారు. పంచాయితీ ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, చంద్రబాబుతో లాలూచీ పడే నిమ్మగడ్డ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అయితే పంచాయితీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతాయని తెలియకుండా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పార్టీ మేనిఫెస్టో విడుదల చేశాడని ఎందుకు దీనిపై నిమ్మగడ్డ చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఇష్టమొచ్చినట్టు ప్రభుత్వాధికారులపై, సలహాదారులపై చర్యలు తీసుకుంటున్న నిమ్మగడ్డ ఎందుకు చంద్రబాబుపై ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిమ్మగడ్డ చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరిస్తూ, తన కుల పిచ్చితో చంద్రబాబుకు మేలు చేసే నిర్ణయాలను తీసుకుంటున్నారని అన్నారు. నిమ్మగడ్డ లాంటి వ్యక్తి ఉండాల్సింది ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో అని రాజ్యాంగ పదవిలో కాదని విజయసాయి అన్నారు.